News

రైతుకెంత కష్టం


గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు తెలంగాణ రైతుకు తెరిపినివ్వడంలేదు. వడగళ్ల వానలు, ఈదురు గాలులతో లక్ష ఎకరాలకు పైగా వ్యవసాయ, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా చేతిదాకా వచ్చిన వరి, నువ్వులు, సజ్జ పంటలు, మామిడి, టమొట నేలపాలయ్యాయి. వరి, నువ్వులు, సజ్జ, మొక్కజొన్న, జొన్న తదితర పంటలు దాదాపు లక్ష ఎకరాల మేరకు దెబ్బతిన్నాయి. అకాల వర్షానికి వరి రైతు కుదేలైపోయాడు. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు  వేల ఎకరాల మేరకు వరి నీటిపాలైంది. అసలే ఈ రబీలో వరి సాగు విస్తీర్ణం 5 లక్షల ఎకరాలుపైగా  తగ్గిపోగా.. ఇప్పుడు దాదాపు  మరో 60 వేల ఎకరాలు వరి నీట మునగడం ఆందోళన కలిగిస్తోంది. నీటమునిగిని వరిపనలను ఆరబెట్టుకునే అవకాశం కూడా వరుణుడు ఇవ్వడంలేదని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక నువ్వులు, సజ్జలు, మొక్కజొన్న పండించేవారిదీ ఇదే దుిస్థితి. ఏపుగా ఎదిగిన పంట కళ్లముందే నీటమునుగుతుంటే ఏమీ చేయలేని పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా 20 వేల ఎకరాల మేరకు నువ్వుల పంట, వేల ఎకరాల మేరకు సజ్జ, 4 వేల ఎకరాల మేరకు మొక్కజొన్న పంటకు అకాల వర్షం నష్టం కలిగించింది. వరుణుడి ప్రభావం కరీంనగర్‌ జిల్లాపై అధికంగా పడింది. ఈ జిల్లాలోనే వేలాది ఎకరాల పంట వర్షార్పణమైంది. పక్వానికొచ్చిన మామిడి నేలరాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో వర్షాల నష్టం అధికంగానే ఉంది. ఇక్కడ 17వేల ఎకరాల మేరకు పంట నష్టం జరిగినట్లు అధికారులు తేల్చారు. ఇక నల్లగొండ జిల్లాలో 15 వేల ఎకరాలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 15 వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. మెదక్‌ జిల్లాలో 17 వేల ఎకరాలు, రంగారెడ్డిలో 3 వేల ఎకరాలు, నిజామాబాద్‌లో 30 వేల ఎకరాలు, వరంగల్‌లో ఎనిమిది వేల ఎకరాలు మేర పంట నీట మునిగింది. మామిడి రైతుపైనా అకాల వరుణుడు పెను ప్రభావం చూపాడు. ఈదురుగాలులకు వేలాది ఎకరాల మామిడితోటల్లో కాయలు నేలరాలాయి. కాసిన కొద్ది కాయలూ రాలిపోవడంతో రైతుకు దిక్కుతోచడంలేదు. దాదాపు 15 వేల ఎకరాల మామిడితోటలు దెబ్బతిన్నట్లు అంచనా. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 28 వేల ఎకరాల మేరకు ఉద్యానవన పంటలకూ నష్టం వాటిల్లింది. ఇందులో సగానికిపైగా మామిడి తోటలకే నష్టం జరిగింది. మామిడితో పాటుగా అరటి, బొప్పాయి, ద్రాక్ష, కూరగాయల పంటలకూ నష్టం వాటిల్లింది. మొత్తంమీద వ్యవసాయ, ఉద్యానవన పంటలు కలుపుకొని లక్ష ఎకరాలకు పైగా పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ, ఉద్యానవన శాఖల అంచనా వేస్తున్నాయి.